"శ్రీకాంత్ అడ్డాల" ఇటీవల దర్శకత్వం వహించిన సినిమా "పెద్దకాపు 1". ఈ సినిమాలో ప్రధాన పాత్రలో "విరాట్ కర్ణ" మరియు "ప్రగతి శ్రీవాత్సవ" నటించారు. సహాయక పాత్రలలో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, అనసూయ తదితరులు నటించారు. దీనిని "ద్వారకా క్రియేషన్స్" బ్యానర్ మీద "మిరియాల రవీందర్ రెడ్డి" మరియు "మిరియాల సత్యనారాయణ రెడ్డి" నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యి ఇటీవల అమెజాన్ ప్రైమ్ (ఓటిటి)లోకి వచ్చింది.
కధేంటంటే...
"గోదారి ప్రాంతం"లోని ఒక చిన్న పల్లెటూర్లో జరిగే పెద్దకాపు అనే సామాన్యుడి కథ. అవి "ఎన్టీఆర్" తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన రోజులు. సత్య రంగయ్య(రావు రమేష్) మరియు బయన్న(నరేన్) : ఈ రెండు ముఠాలు ఆ ఊరిలో అధికారం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. పెద్ద కాపు ఈ రెండు ముఠాలను దాటుకొని ఆ ఊరి రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాడు మరియ రక్తపాతాన్ని వాడి సామాన్యుడి నుంచి నాయకుడిగా ఎలా ఎదుగుతాడు అనేది సినిమా.
ఎలా ఉందంటే...
చిన్న.పెద్ద. సాధారణంగా ఈ రెండు పదాలని వస్తువులకి వాటి వాటి ఆకారాన్ని బట్టి వాడతారు. అలాగే మనుషులకు కూడా వాడతారు. కానీ ఆకారాన్ని బట్టి కాదు. వాళ్ల వాళ్ల కులం, మతం, జాతి, పేద, ధనిక ఇలా చెబుతూ ఉంటే చాలానే ఉంటాయి. వీటిలో నుంచి ఒకదాన్ని తీసుకొని దానికి రాజకీయాలు అనే అంశాన్ని జోడించి శ్రీకాంత్ అడ్డాల ఈ కథను రాసుకొని దర్శకత్వం వహించారు. ఏ మాట కా మాట సినిమాలో కెమెరా పనితనం చాలా బాగుంది, ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. కానీ ఫ్రేమ్స్ ఉన్నంత అద్భుతంగా సినిమా అయితే లేదు. 60వ దశకంలో సినిమా మొదలవుతుంది. సినిమా మొదటిలోనే ఒక పది సంవత్సరాల అమ్మాయి అప్పుడే పుట్టిన ఒక పసికందును చాటలో పెట్టుకొని అమ్మడానికి గ్రామంలోకి వెళ్లే సీన్లు గట్టిగానే తగులుతాయి మరియు ఆ పాప ఎవరు అని సందేహాం కూడా వస్తుంది. ఈ అంశాన్ని కంటిన్యూ చేయకుండా డైరెక్ట్ గా "ఆత్మగౌరవం" అని చెప్పి జండా పాతే సీన్లకు వెళ్ళిపోతాం. గ్రామంలో యువకులందరూ కలిసి జండా పాతడం కోసం చెట్టు నరికి గ్రామంలోకి తీసుకొచ్చే సీన్లు, జండా పాతిపెట్టే సమయంలో రెండు ముఠాలు దాన్ని అడ్డుకోవడం, ఆడుకోవడంలో సృష్టించే రక్తపాతం, అందరిని ఎదిరించి గ్రామం అంతా ఒక్కటై జెండా పాతడం ఈ సీన్స్ అన్ని ఒక మంచి సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తాయి. సినిమాలో మొదటి సగం మొత్తం క్యారెక్టర్ లను పరిచయం చేస్తూనే ఉంటాడు మన అడ్డాల. ఇది మనం రెగ్యులర్ సినిమాల్లో చూడుము. ఆ క్యారెక్టర్స్ లోని లోతును చూపించడం కోసమే ఇక్కడ డైరెక్టర్ కావాలని ఆ క్యారెక్టర్ లను పరిచయం చేయడానికి టైం తీసుకున్నారని అనిపిస్తుంది. కానీ ఎంత కావాలని చేసినా.., సినిమాకి అవి అవసరమైనా.., చూసే వాళ్లకు మాత్రం చాలా బోరింగ్ గా నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అదే సమయంలో ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ రివిల్ చేస్తారు. దాంతో చూసేవాడికి నిద్రలో నుంచి ఒక్కసారిగా లేచినట్టు అనిపిస్తుంది. రెండవ భాగం కూడా అంతే ఎంగేజింగా ఉంటుందని అనుకుంటాం. అయితే రెండవ భాగంలో వచ్చే బ్యాక్ స్టోరీ, ట్విస్టులు, పెద్ద కాపు సోదరుడు ఏమయ్యాడు అనే ప్రశ్నతో, కొన్ని మంచి డైలాగ్స్ తో కూడిన సీన్స్ తో సెకండ్ హాఫ్ కొంతవరకు మెప్పిస్తుంది. సినిమా మొత్తంలో 60 శాతం కథ ఉంటే మిగిలిన 40 శాతం మాత్రం తలనరకడం, మనుషుల్ని కుంభీపాకం చేయడం, రక్తపాతం అంతా ఇదే ఉంటుంది. ఈ రక్తపాతాన్ని కొంచెం తగ్గించి, కొన్ని మంచి సీన్స్ రాసుకొని కథని కొంచెం ఎంగేజింగా చెప్పి ఉంటే బాగుండేది.
ఎవరు ఎలా చేశారు అంటే...
హీరో విరాట్ కర్ణ కొత్తవాడైనప్పటికీ తన నటనతో కచ్చితంగా మెప్పించాడనే చెప్పాలి. రావు రమేష్ కి పెద్దగా డైలాగ్స్ లేకపోయినా ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ వాడి సత్య రంగయ్య పాత్రను పండించారనే చెప్పాలి. ఈ సినిమాలో "అనసూయ" ఒక పాత్రలో కనిపిస్తుంది. ఆమెని ఆ పాత్రలో చూశాక ఆ పాత్ర తనని ఊహించుకొనే రాసారేమో అన్నట్టు అనిపిస్తుంది. రావు రమేష్ విలనిజాన్ని తన కొడుకుగా చేసిన శ్రీకాంత్ అడ్డాల కొనసాగిస్తాడు. కుర్చీలో కూర్చొని విలనిజాన్ని చూపిస్తాడు అడ్డాల. హీరోయిన్ ప్రగతి అందంగా కనిపించినా... తన పాత్ర అంతగా అనిపించదు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, మరో విలన్ గా నరేన్, వాళ్ల వాళ్ల పాత్రల్లో మెప్పిస్తారు.
సాంకేతికంగా ఈ సినిమా మెరుగైనది. "చోటా కె నాయుడు" సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. దానితోపాటు DI కూడా బాగా చేశారు. సినిమా మొత్తంలో కొన్ని డైలాగ్స్ బాగుంటాయి అయితే వాటిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది.
చివరిగా...
ఈ సినిమా డైరెక్టర్ చెప్పినట్టు ఒక సామాన్యుడి సంతకం. అయితే మొత్తం కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. సినిమాలో వరుసగా క్యారెక్టర్ లను సగం సగం పరిచయం చేసుకుంటూ వెళ్లడం దీనికి కారణం. ట్విస్టులు రివీల్ అయ్యేంతవరకు ఏమీ అర్థం కాదు. (మామూలుగా మాట్లాడే భాషలో చెప్పాలంటే ఈ సంతకం కొంతసేపటి వరకు కోడిగెలికినట్టు ఉంటుంది). తర్వాత సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులతో కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. మొత్తం మీద ఇది కొన్ని వర్గాలకు తప్ప మిగిలిన వాళ్ళకి ఒక బోరింగ్ ఎక్స్పీరియన్స్ లా మిగిలిపోతుంది.
Rating - 2.25/5