"మ్యాడ్" సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన సంగీత్ శోభన్, ఇప్పుడు "ప్రేమ విమానం" అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్,శాన్వి మేఘన జంటగా రవి వర్మ, అనసూయ భరద్వాజ్ మరియు వెన్నెలకిషోర్ ప్రధానపాత్రలలో నటించారు. ఈ సినిమా ఇప్పుడు "జీ ఓ.టి.టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ప్రేమ విమానం ఎలా ఉందో చూద్దాం..!
రాము(దేవాన్ష్ నామా), లచ్చు(అనిరుధ్ నామా) అనే ఇద్దరు అన్నదమ్ములు..తమ స్నేహితుల మాటలు విని తాము కూడా విమానం ఎక్కాలని నిశ్చయించుకుంటారు. అదే విషయాన్ని వాళ్ళ నాన్నకి చెబుతారు. పంటలు బాగా పండితే నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను అని తండ్రి మాట ఇస్తాడు. కానీ, అప్పుల బాధ తట్టుకోలేక ఆ తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి శాంతమ్మ కుటుంబ భారాన్ని మీద వేసుకుంటుంది. కానీ, వీళ్లది పసితనం, ఏమీ తెలియని వయసు.. ఎలాగైనా విమానం ఎక్కాలని మొండిగా కూర్చుంటారు. ఊర్లో వాళ్ళ మాటలు విని డబ్బుంటే గాని వెళ్ళలేము అని అర్థం చేసుకుంటారు. ఆ డబ్బు కోసం రకరకాలుగా కష్టపడతారు..
ఇదిలా ఉండగా...
మణి(సంగీత్ శోభన్), అబిత(శాన్వి మేఘన) ఇద్దరు చిన్నప్పుడు నుంచి ప్రేమించుకుంటారు. ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం. ఆ కారణంగానే తండ్రి ఎంత చెప్పినా వినకుండా.. అదే ఊర్లో వాళ్ళ కిరాణా కొట్టుని చూసుకుంటూ ఉండిపోతాడు మణి. వీళ్ళ ప్రేమ ఎలాంటిదంటే ఆ కథలో పిల్లలు విమానం ఎక్కడానికి నానా కష్టాలు పడుతుంటే.. వీళ్ళు మాత్రం మాట్లాడుకోవడం కోసం కూడా రాకెట్లను ఉపయోగిస్తారు. అమెరికా నుంచి అబితకు సంబంధం వస్తుంది, ఆ పెళ్లి ఇష్టం లేని అబిత మణితో కలిసి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అందుకోసమని హైదరాబాద్ వెళ్తారు.
ఇదిలా ఉండగా.. మన బ్రదర్స్ ఏమో విమానం ఎక్కాలని పిచ్చితో ఇంట్లో తమ తల్లి అప్పు తీర్చడం కోసం కూడపెట్టుకున్న డబ్బులు తీసుకొని వాళ్ళు కూడా హైదరాబాదుకు వెళ్తారు. అక్కడ వారికి ఎదురైన సమస్యలు ఏమిటి? ఈ బ్రదర్స్, ఆ ప్రేమ జంట ఎలా కలుస్తారు? విమానం ఎక్కాలన్న వీళ్ళ కల నెరవేరుతుందా? తల్లిదండ్రులను ఎదిరించి పారిపోయిన వీళ్ళ ప్రేమ సఫలం అవుతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
సినిమా ఎలా ఉంది అంటే...
డైరెక్టర్, రెండు గంటల్లో, రెండు ప్రపంచాలని చూపించాలి కాబట్టి మనం కథలోకి వెళ్లడానికి పెద్దగా సమయం పట్టదు. కానీ, ఇక్కడ డైరెక్టర్ ప్రేమ కథ కన్నా.. పిల్లల విమానం కథ మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుంది. ఎందుకంటే, ఆ ప్రేమ కథలో ఒకటి.. రెండు.. సన్నివేశాలు తప్ప మిగిలినవి అంతగా మెప్పించవు. కొత్తదనం ఏమీ ఉండదు. ఇక్కడ ప్రేమ కథ మెప్పించకపోయినా, కథలోని జంట అదే మణి (సంగీత్ శోభన్), అబిత(శాన్వి మేఘన) ఇద్దరు వాళ్ల ఎక్స్ప్రెషన్స్ తో, నటనతో మెప్పించారని చెప్పాలి. అలా అని పిల్లల విమాన కథలో కూడా పెద్దగా కొత్తదనం ఏమి లేదు. చాలా వరకు సీన్లు ఇంతకుముందు విమానం మీద వచ్చిన సినిమాల్లో సీన్స్ లాగే ఉంటాయి. కానీ చాలా వరకు సినిమాల్లో పెద్దలు పిల్లల కోసం ఏదో ఒకటి చేసి, వాళ్ల కలని నెరవేర్చాలనుకుంటారు... ఇక్కడ అది రివర్స్. పిల్లలే రకరకాలుగా కష్టపడి ఏదో ఒకటి చేసి వెళ్దామని నిర్ణయించుకుంటారు. వీళ్లు ఇలా నిర్ణయించుకోవడం, వాళ్లు పారిపోవడానికి సిద్ధపడడం.. 80 శాతం సినిమా మొత్తం ఇదే ఉంటుంది. ఆఖరి 30 నిమిషాలు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే రెండు కథలు రొటీన్ అయినా కానీ ఆ రెండు కథలని కలిపిన విధానం మెప్పిస్తుంది. ఈ ఆఖరి అరగంట తప్ప, మిగిలిన సినిమాలో కొన్ని అవసరంలేని సీన్స్ వరకు కట్ చేసి ఉంటే బాగుండేది. అంతగా ల్యాగ్ అనిపించేది కాదు. కట్ చేయకపోవడం వల్ల అక్కడక్కడ కామెడీ సీన్స్ తో గడిచిపోతుంది.
కామెడీ సీన్స్ అంటే ఒక విషయం చెప్పాలి.. పిల్లలు విమానం గురించి వాళ్ల మ్యాక్స్ టీచర్ (వెన్నెల కిషోర్ )ని అడిగి ఇబ్బంది పెట్టే సీన్లు చాలా బాగుంటాయి.
ఈ సినిమాని కాపాడింది అవే కామెడీ సీన్లు మరియు అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. పాటలు వినడానికి చాలా బాగున్నాయి సినిమా మొత్తంలో చాలా సీన్స్ వరకు ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే నిలబడ్డాయి. ఎడిటింగ్ అంతంత మాత్రమే ఇంకా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. డైరెక్టర్ తన పనిలో కొంచెం వరకు సఫలమయ్యారని చెప్పాలి. రెండు కథలు రొటీన్ గా ఉన్న కొంచెం కామెడీ, ఆ రెండు కదలని కలిపిన విధానానికి మార్కులు వెయచ్చు.
మొత్తం మీద ఇవి రొటీన్ కథలు అయినా గాని చివరిలో ఒక మంచి సినిమా చూసాము అనే భావనని ఇస్తుంది.
Rating - 2.5/5